Pakistan: పాకిస్థాన్ వెళ్తా.. పర్మిషన్ ఇవ్వండి: కేంద్రం అనుమతి కోరిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఈ నెల 9న కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభిస్తున్న పాకిస్థాన్
- కేంద్రానికి లేఖ రాసిన సిద్ధూ
- గతంలో పాక్ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా కారిడార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కూడా ఆహ్వానం అందింది. దీనిపై సిద్ధూ కేంద్రానికి లేఖ రాశారు. పాకిస్థాన్ వెళ్లేందుకు తనకు అనుమతి మంజూరు చేయాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ను కోరారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాక్ ప్రభుత్వం తనను కూడా ఆహ్వానించిందని, పాక్ వెళ్లేందుకు అనుమతించాలని సిద్ధూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
కాగా, సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మంచి స్నేహితుడు. ఇద్దరూ క్రికెటర్లు కావడంతో మైదానంలో వీరిమధ్య స్నేహం బలపడింది. ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించి తమదైన ముద్ర వేస్తున్నారు. కొంతకాలం కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూపై విమర్శల వర్షం కురిసింది.