Tokyo: భారత మహిళా హాకీ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
- ఒలింపిక్స్ క్వాలిఫయర్ మ్యాచుల్లో మొత్తం 6 గోల్స్ చేసి అర్హత
- తొలి మ్యాచ్ లో భారత్ 5-1తో అమెరికాపై విజయం
- రెండో మ్యాచ్ లో 1-4 తేడాతో భారత్ ఓటమి
భువనేశ్వర్ వేదికగా కొనసాగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్ మ్యాచుల్లో భారత మహిళా హాకీ జట్టు మిశ్రమ ఫలితాలను చవిచూసినప్పటికి, ఓవరాల్ గోల్స్ సంఖ్య ప్రత్యర్థి జట్టుకన్నా ఎక్కువగా ఉండటంతో టోక్యో ఒలింపిక్స్ కు అర్హత పొందింది. ఈరోజు జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో భారత్ 1-4 గోల్స్ తేడాతో అమెరికా చేతిలో పరాజయం పాలైంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో భారత్ 5-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మొత్తంగా చూస్తే భారత్ 6 గోల్స్ , అమెరికా 5 గోల్స్ నమోదు చేయడంతో భారత్ కు టోక్యో బెర్త్ ఖాయమైంది.
రెండో క్వాలిఫయర్ లో భారత్ ఒత్తిడికి లోనైంది. అమెరికా 4-0 గోల్స్ చేసి ఆధిక్యంలో ఉంది. భారత్ జట్టుకు ఓటమి ఖాయమైనప్పటికి.. ఒక గోల్ చేస్తే టోక్యో ఆశలు సజీవంగా ఉంటాయన్న పరిస్థితిని ఎదుర్కొంది. చివరి క్వార్టర్ లో కెప్టెన్ రాణి రాంపాల్ అద్భుతంగా గోల్ చేసి అమెరికా ఆధిక్యాన్ని 1-4 కు తగ్గించింది.