TSRTC: దోపిడీ వ్యూహంలో భాగమే టీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ యోచన : పొన్నాల లక్ష్మయ్య
- గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీకి భిన్నమైనదీ నిర్ణయం
- యాభై వేల మంది కార్మికుల కుటుంబాల పొట్ట కొడుతున్నారు
- సమ్మెను శాంతియుతంగా పరిష్కరించకుండా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్
టీఎస్ఆర్టీసీ ఆస్తులను, సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యూహంలో భాగమే ప్రభుత్వం చేసిన ప్రైవేటీకరణ సూత్రమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న మంత్రివర్గం నిర్ణయంపై ఆయన స్పందించి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి, ఇప్పుడు చేసిన ప్రకటనకు పొంతనలేదని ధ్వజమెత్తారు. సమ్మె కారణంగా రోజుకి కోటి మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదంతా ప్రభుత్వ నిర్వాకం పుణ్యమేనన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాభైవేల మంది కార్మిక కుటుంబాల పొట్టకొట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
సమ్మె సమస్యను పరిష్కరించాల్సింది పోయి కార్మికులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని కేసీఆర్ చెప్పుకుంటున్నప్పుడు కార్మికులతో నేరుగా చర్చలు జరపడానికి సమస్య ఏమిటన్నారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయక పోవడంలోనే ప్రభుత్వ కుట్ర దాగిఉందన్నారు.