Vijayareddy: విజయారెడ్డిని ఎందుకు చంపానంటే... పోలీసుల విచారణలో వివరించిన సురేశ్!
- ఉస్మానియాలో కోలుకుంటున్న సురేశ్
- ఎన్నిసార్లు తిరిగినా పట్టా ఇవ్వలేదు
- అందుకే చంపానని సురేశ్ స్టేట్ మెంట్
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కోలుకుంటుండగా, పోలీసులు అతన్ని విచారించారు. ఇంత దారుణమైన నిర్ణయానికి అతను రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మేజిస్ట్రేట్ ను తీసుకుని వెళ్లి, సురేశ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. తాను పట్టా కోసం చాలాకాలంగా తహసీల్దారు విజయారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నానని, కానీ పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించారని సురేశ్ తన స్టేట్ మెంట్ లో స్పష్టం చేశాడు.
తన భూమిపై కోర్టు కేసులు ఉన్నాయని, జాయింట్ కలెక్టర్ నుంచి కూడా తనకు ఆదేశాలున్నాయని ఆమె చెప్పారని, తాను ఎన్నిసార్లు తిరిగి, ఎంతగా వేడుకున్నా, ఆమె కుదరదనే చెబుతూ వచ్చిందని సురేశ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో తాను పెట్రోల్ పోసి నిప్పంటించానని అంగీకరించిన సురేశ్, తాను కూడా చనిపోవాలనే ఈ పని చేశానని చెప్పినట్టు సమాచారం. కాగా, సురేశ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 307, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.