Facebook: కొత్త లోగోను ఆవిష్కరించిన ఫేస్ బుక్!
- శాన్ ఫ్రాన్సిస్కోలో కార్యక్రమం
- ఇతర యాప్స్ తో పోలిస్తే మరింత స్పష్టత కోసమే
- త్వరలోనే కొత్త వెబ్ సైట్ కూడా మొదలు
ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, నూతన లోగోను ఆవిష్కరించింది. వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర పేరున్న యాప్స్ కు మాతృసంస్థగా ఉన్న ఫేస్ బుక్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో నూతన లోగోను విడుదల చేసింది.
ఫేస్ బుక్ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుంచి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని, యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు ఫేస్ బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఫేస్ బుక్ అధీనంలోనే ఫేస్ బుక్ యాప్, మెసింజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్, ఓకులస్, వర్క్ ప్లేస్, పోర్టల్, కాలిబ్రా వంటి అనుబంధ యాప్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫేస్ బుక్ కొత్త వెబ్ సైట్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని ఆంటోనియో వెల్లడించారు.