Vishnu Vardhan Reddy: నా పేరుతో ఫేక్ అకౌంట్లు నడుపుతూ దుష్ప్రచారం చేస్తున్నారు: కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
- పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపణ
- ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు
- విచారణకు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ
కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తన పేరుతో తప్పుడు అకౌంట్లు నడుపుతూ తన పేరుప్రతిష్ఠలు దెబ్బతీస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ లో ఓ ఫేక్ అకౌంట్, యూట్యూబ్ లో ఓ చానల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షతో రెండు వర్గాల మధ్య వైషమ్యాలు చెలరేగేలా పోస్టులు పెడుతున్నారని వివరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఆ కథనాలకు మార్ఫింగ్ ఫొటోలు జోడిస్తున్నారంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
కాగా, విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఫేక్ అకౌంట్లను తనిఖీ చేయాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.