kcr promise: కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి: గవర్నర్ తమిళిసైకు పీసీసీ నేతల వినతి

  • రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని మాట తప్పారు 
  • మిడ్ మానేరు జలాశయం పునరావాస కుటుంబాలకిచ్చిన మాట మరిచారు
  • 20 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు  

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటన చేసినప్పుడు అక్కడి ప్రజలకు పలు హామీలు ఇచ్చి నెరవేర్చడం మరిచాడని పొన్నం విమర్శించారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర నేతల బృందం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మిడ్ మానేరు జలాశయం పునరావాస కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారు. రాష్ట్రంలో అర్హులకు రూ.5 లక్షలతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని మాట తప్పారు’ అని అన్నారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వ నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల కారణంగా మిడ్ మానేరు జలాశయం లీకేజీలమయంగా మారింది. 20 టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.మరమ్మతులపై జరిగిన వ్యయంపై న్యాయవిచారణ జరిపించాలి’ అని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News