New Delhi: ఊపిరి పీల్చుకుంటున్న హస్తిన... తగ్గిన వాయు కాలుష్యం!
- కాస్తంత మెరుగుపడిన ఎయిర్ క్వాలిటీ
- ఏక్యూఐ 356 పాయింట్లుగా నమోదు
- గణాంకాలు వెల్లడించిన అధికారులు
గడచిన దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించిన వివరాల మేరకు ఢిల్లీలో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 356గా నమోదైంది. గత వారంలో ఇది 400 నుంచి 600 వరకూ నమోదైన సంగతి తెలిసిందే. కాలుష్యం కొంతమేరకు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక నిన్న విజబిలిటీ 2,500 మీటర్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ ఇండెక్స్ ఇంకా 'వెరీ పూర్' కేటగిరీలోనే కొనసాగుతోంది. ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో ఏక్యూఐ 468గా ఉంది. నోయిడాలో 412గా, గురుగ్రామ్ లో 389గా నమోదైంది. ఈ గణాంకాలు ప్రమాదకర స్థాయినే సూచిస్తున్నా, దీపావళి తరువాతి రోజుతో పోలిస్తే, ఎయిర్ క్వాలిటీ కాస్తంత మెరుగు పడినట్టేనని భావించవచ్చని అధికారులు వ్యాఖ్యానించారు.