Maharashtra: మహారాష్ట్రలో చర్చలు జరిగితే ఆ ఒక్క అంశంపైనే జరగాలి: శివసేన నేత సంజయ్ రౌత్
- ఎన్నికల ముందు బీజేపీ-శివసేన మధ్య ఒప్పందం కుదిరింది
- ఆ తర్వాతే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం
- ముఖ్యమంత్రి పదవిపై మాత్రమే చర్చలు జరగాలి
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు బీజేపీ-శివసేన మధ్య కుదిరిన ఒప్పందంపై మాత్రమే చర్చలు జరగాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న విషయంపై బీజేపీతో ఒప్పందం కుదిరిందని ఆయన మరోసారి చెప్పారు.
ఆ తర్వాతే బీజేపీతో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చేశామని సంజయ్ రౌత్ అన్నారు. ఇకపై బీజేపీతో చర్చలు జరిగితే ఈ అంశంపై మాత్రమే చర్చలు జరగాలని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన జాప్యం నేపథ్యంలో ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలిశారు.