KCR: ఆర్టీసీలో ‘ప్రైవేటు’పై కేసీఆర్ రేపు కీలక ప్రకటన
- ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ
- సమ్మెపై నిన్న కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
- 5100 రూట్లలో ప్రైవేటు పర్మిట్లపై ప్రకటన చేయనున్న సీఎం
ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసి రెండు రోజులైపోయింది. అయినా, కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ, అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లపై చర్చించారు.
ప్రస్తుతానికి 5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా రూట్లనూ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు. నేడు హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో రేపు ఈ విషయమై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు విచారణకు సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకానున్నారు.
ప్రభుత్వం తరపున వాదనలు ఎలా వినిపించాలనే అంశంపై సీఎం వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు విధుల్లో చేరిన వారికి భద్రత కల్పించాలని, బస్సులను యథాతథంగా నడపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.