Sivasena: రాజకీయాల్లో 'మహా' మలుపు... రెండు ముక్కలైన శివసేన?
- కొత్త మలుపు తీసుకున్న మహారాష్ట్ర రాజకీయం
- ప్రతిష్ఠంభనకు ముగింపు పలకాలంటున్న శివసేన వర్గం
- అధికారాన్ని పంచుకోవాల్సిందేనంటున్న మరో వర్గం
మహారాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపును తీసుకున్నాయి. బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవడంలో విఫలమైన శివసేన, రెండుగా చీలినట్టు సమాచారం. రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీలో ఓ గ్రూప్ ప్రస్తుత ప్రతిష్ఠంభనకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తుండగా, మరో గ్రూప్ చెరి రెండున్నరేళ్ల సీఎం పీఠం కోసం పట్టుబడుతోంది. శివసేన ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించారని వార్తలు రాగా, వాటిని పార్టీ నేతలు ఖండించారు. సీఎం పదవిని పంచుకునేందుకు బీజేపీ ససేమిరా అంటున్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసినా ప్రభుత్వం మాత్రం ఇంకా ఏర్పడలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, శివసేన తోడు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. దీంతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం పీఠంపై చూడాలని భావిస్తున్నారు. ఇక శివసేన చీలికపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.