Road Accident: అదుపుతప్పి కాలువలోకి బోల్తాకొట్టిన లారీ: డ్రైవర్‌కు స్వల్పగాయాలు
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపాన ప్రమాదం
- లారీలో రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు
- డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదమన్న పోలీసులు
నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ లారీని అదుపు చేయడంలో విఫలం కావడంతో రోడ్డు పక్కనున్న కాలువలోకి వాహనం బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు గుట్కా ప్యాకెట్ల లోడుతో ఓ లారీ వెళ్తోంది. ఈరోజు తెల్లవారు జామున లారీ టెక్కలి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పింది. ఈ ప్రాంతంలో జాతీయ హదారి పక్క నుంచి వంశధార ఎడమ కాలువ వెళ్తోంది.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో కాలువ రోడ్డు క్రాసింగ్ వద్ద వాహనాన్ని అదుపు చేయడంలో విఫలం కావడంతో వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి కాలువలోకి లారీ బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు లారీ ప్రయాణిస్తున్న దిశలోనే బోల్తాకొట్టడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీలో రూ.2 లక్షల విలువైన గుట్కా ఉందని గుర్తించారు.