Nara Lokesh: వీరబాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చే లోపే మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: లోకేశ్
- ఇసుక కొరత అంశంపై లోకేశ్ వ్యాఖ్యలు
- జగన్ పై ట్విట్టర్ లో విమర్శలు
- ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్
ఇసుక కొరత వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. "మీ అసమర్థత వల్ల కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారు, కాకినాడలో వీరబాబు అనే కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి వచ్చేలోపు మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవాలి" అంటూ సవాల్ విసిరారు.
"భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ శవరాజకీయాలకు పాల్పడుతోందని జగన్ అనడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టుగా ఉంది. శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరే జగన్ గారూ, ఆ విషయం మీరు మర్చిపోయినట్టుంది. ఆత్మహత్యలను అపహాస్యం చేయడం ఇప్పటికైనా మానండి" అంటూ హితవు పలికారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.