Gold: భారీగా తగ్గిన బంగారం ధర!
- గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన ధర
- ఇప్పుడు రూ. 37,575కు చేరిక
- రూ. 1,490 తగ్గిన కిలో వెండి ధర
గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నిన్న ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. బుధవారంతో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ –నైమెక్స్ లో ఔన్స్ బంగారం ధర 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్దకు చేరింది. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు అమెరికా, చైనా ప్రకటించడంతో చాలామంది ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నేడు కూడా బంగారం ధర దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.