Hyderabad: కుమార్తె బర్త్ డే వేడుకలకు అప్పు... తీర్చేందుకు చైన్ స్నాచింగ్!
- హైదరాబాద్ లో ఘటన
- ట్యాంక్ బండ్ పై గొలుసు దొంగతనం
- నిందితులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు పుట్టినరోజు వచ్చింది. అప్పు చేసి మరీ వేడుకలు చేసుకుని, బంధుమిత్రులను పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆపై ఆ అప్పు తీర్చడం కోసం పెడదారి పట్టి, ఓ వ్యక్తి మెడలోని బంగారు గొలుసును దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజీల పుణ్యమాని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని మాణికేశ్వరినగర్ కు చెందిన గండికోట ప్రభు అలియాస్ బన్నీ, అలియాస్ డేవిడ్ (22) సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రి ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పనిచేస్తున్నాడు. తన కుమార్తె పుట్టిన రోజు కోసం అప్పు చేశాడు. దాన్ని తీర్చే మార్గాన్ని వెతికే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు వెంకటేశ్ (19), రామాంతపూర్ కు చెందిన సందీప్ (21)తో కలిసి ప్లాన్ చేశాడు.
పూటుగా మద్యం తాగి, అర్థరాత్రి ట్యాంక్ బండ్ పరిసరాల్లో తిరుగుతూ, తన తండ్రికి మందులు ఇచ్చి వస్తున్న పసుపులేటి గోవింద్ అనే వ్యక్తి మెడలో ఉన్న 2 తులాల గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో కుమార్తె పుట్టిన రోజు కోసం చేసిన అప్పును తీర్చేందుకే ఈ పని చేశామని నిందితుడు అంగీకరించాడు. అతని నుంచి బంగారం, బైక్, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను పాత నేరస్థుడేనని, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, చిలకలగూడ, గోపాలపురం, అంబర్పేట, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతాల్లో కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.