Bolivia: బొలీవియాలో మహిళా మేయర్‌కు తీవ్ర అవమానం.. నడి రోడ్డుపై జుట్టు కత్తిరించిన ఆందోళనకారులు.. వీడియో వైరల్
- దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో తీవ్ర ఘర్షణలు
- అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు
- ఓ విద్యార్థి (20) మృతికి మేయర్ కారణమని ఆగ్రహం
దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
చాలా మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఓ విద్యార్థి (20) మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ కార్యాలయంలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు దానికి నిప్పంటించి, పేట్రిసియా ఆర్సేను వీధిలోకి ఈడ్చుకువచ్చారు.
ఆమెపై ఎరుపురంగు చల్లి, చెప్పులు లేకుండా రోడ్డుపై తిప్పుతూ వేధించారు. చివరకు ఆమెను మోకాళ్లపై కూర్చోబెట్టి, జుట్టు కత్తించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మేయర్ ను రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆందోళనకారులపై పేట్రిసియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీరు కార్చుతూ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.