GO 2430: జీవో 2430పై ఎడిటర్స్ గిల్డ్ స్పందించడం పట్ల లోకేశ్ హర్షం
- మీడియాపై నియంత్రణ కోసం జీవో 2430
- ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ సర్కారు
- ప్రకటన ద్వారా స్పందించిన ఎడిటర్స్ గిల్డ్
- ఎడిటర్స్ గిల్డ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన లోకేశ్
మీడియా చానళ్లు, పత్రికలపై నియంత్రణ కోసం వైసీపీ సర్కారు అమలు చేయదలిచిన జీవో 2430పై తాజాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇలాంటి చట్టాలు ఉపసంహరించుకోవాలని కోరింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ స్పందించారు. ప్రజల ఇష్టాయిష్టాలు, పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, ఇప్పుడు సీఎం జగన్ వాటిని కూల్చివేయడానికి, వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
కిరాతకమైన జీవో 2430ని వెనక్కితీసుకోవాలని గళమెత్తుతున్న గొంతుకలకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని లోకేశ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాపాడడంలో ముందు నిలిచి పోరాడుతున్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ అంశంపై స్పందించడం హర్షణీయమని, ఎడిటర్స్ గిల్డ్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.