ayodhya: సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చిన ఐదుగురు న్యాయమూర్తులు
- కాసేపట్లో తీర్పు
- పలు రాష్ట్రాల సీఎంల విజ్ఞప్తి
- అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై తీర్పును వెల్లడించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ పైకి ఐదుగురు న్యాయమూర్తులు వచ్చారు. కాసేపట్లో తీర్పు వెల్లడి కానుంది. ఇటీవల 40 రోజుల పాటు ఈ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణ జరిపిన విషయం తెలిసిందే. సున్నితమైన ఈ కేసు తీర్పు నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తూ ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు.
'సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలందరూ స్వాగతించాలి. దీనిపై ఎలాంటి వివాదం ఉండకూడదు. ఎవ్వరూ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించకూడదని నేను కోరుతున్నాను. సంయమనం పాటించాలి' అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.
'సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు అంగీకరించాలి. అందరం శాంతి, సామరస్యాలను కొనసాగించాలి. మన లౌకిక విధానానికి సోదరభావమే ముఖ్య లక్షణం' అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు.
కాగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన నివాసం వద్ద ఉన్నతస్థాయి భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్ అరవింద్ కుమార్ మరికొందరు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.