Rajnath Singh: అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన!
- ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలి
- తీర్పును అందరూ స్వాగతించాలి
- ఈ విషయంపై మరో వివాదం ఉండరాదు
అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిందని, భారత సామాజిక నిర్మాణానికి ఈ తీర్పు మరింత బలాన్నిస్తోందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ తీర్పును సమదృష్టితో చూడాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. ఓ మైలురాయి వంటి ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు.
అయోధ్య తీర్పుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ... 'ఈ తీర్పును అందరూ స్వాగతించాలి.. ఇలా చేస్తేనే దేశంలో సామాజిక సామరస్యం వర్థిల్లుతుంది. ఈ విషయంపై మరో వివాదం ఉండరాదని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.
'అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.. దీంతో రామ మందిర నిర్మాణానికి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ తీర్పు వల్ల కేవలం రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అవడమే కాదు.. ఈ విషయంపై రాజకీయాలు చేసే అంశంలో ఇకపై బీజేపీకి మార్గాలు మూసుకుపోయాయి' అని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు.
దశాబ్దాలుగా కొనసాగుతోన్న వివాదానికి ముగింపునిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శాంతి, సంయమనం పాటించాలని ప్రజలను కోరారు.
ఈ తీర్పును ప్రజలందరూ హృదపూర్వకంగా స్వాతగించాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోరారు. ఈ తీర్పు ఒకరి గెలుపు కాదు, అలాగే మరొకరి ఓటమి కాదు అని అన్నారు. శాంతి, సంయమనం పాటించాలని ప్రజలకు చెప్పారు.