Telangana: అప్పర్ ట్యాంక్‌బండ్‌ను మూసేసిన పోలీసులు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టు
- 'చలో ట్యాంక్‌బండ్'కు రావడానికి నేతల ప్రయత్నం
- కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
- ఇంత నిర్బంధాన్ని దేశంలో తాను ఎక్కడా చూడలేదన్న భట్టి విక్రమార్క
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
పలు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే, హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అటువైపుగా వాహనదారులను వెళ్లనివ్వట్లేదు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌ను పూర్తిగా మూసేస్తున్నామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్బంధాన్ని దేశంలో తాను ఎక్కడా చూడలేదని అన్నారు.