Ayodhya: ఒవైసీ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు... అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి
- అయోధ్య అంశంపై సుప్రీం తీర్పు
- హిందూ దేశంగా మార్చుతారంటూ ఒవైసీ వ్యాఖ్యలు
- సుప్రీం తీర్పును ఇరువర్గాలు అంగీకరిస్తున్నాయని రాజా సింగ్ కౌంటర్
అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు ఇచ్చిన అంతిమ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మోదీ 2.0 ప్రణాళిక భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ఉద్దేశించిందని, అందుకు రహదారి అయోధ్య నుంచే మొదలవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అయోధ్య తీర్పును బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ ప్రయోజనాలకు వాడుకుంటాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ఒవైసీ తన ప్రకటనల ద్వారా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇరువర్గాల ప్రజలు అంగీకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లోనే కాదు, మరే ఇతర నగరంలోనూ శాంతికి భంగం వాటిల్లాలని తాము కోరుకోవడం లేదని, ఒవైసీని అరెస్ట్ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజాసింగ్ ట్వీట్ చేశారు.