Rains: కృష్ణానదికి మళ్లీ వరద... జూరాల గేట్లు ఎత్తివేత!
- తూర్పు కర్ణాటకలో వర్షాలు
- జూరాల ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేత
- నాగార్జున సాగర్ వద్ద 4 గేట్లు తెరచిన అధికారులు
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తూర్పు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది మరోసారి వరదతో కళకళలాడుతోంది. ఇప్పటికే నదిపై ఉన్న అన్ని జలాశయాలూ పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉండగా, ఆల్మట్టికి వస్తున్న వరదను వస్తున్నట్టు దిగువకు వదులుతున్న పరిస్థితి. దీంతో ఈ ఉదయం జూరాల ప్రాజెక్టు వద్ద 5 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ప్రస్తుతం 75 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, నేటి సాయంత్రానికి అది 2 లక్షల క్యూసెక్కుల వరకూ పెరవగవచ్చని అంచనా. ప్రస్తుతం జూరాల నుంచి 74,753 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 12 విద్యుత్ యూనిట్ల నుంచి 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
ఇక దిగువకు వదిలే నీరంతా శ్రీశైలం డ్యామ్ కు వస్తోంది. శ్రీశైలంలో పూర్తి స్థాయి జల విద్యుత్ ఉత్పత్తితో పాటు, అన్ని ఎత్తిపోతల పథకాలకూ నీరందించేందుకు ఈ వరద సరిపోతుంది. ఇంతకన్నా పెరిగితే, క్రస్ట్ గేట్లను ఎత్తి, నీటిని విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తి, నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా నీరు చేరుతుండగా, నాలుగు గేట్లను అధికారులు ఈ ఉదయం తెరిచారు. సాగర్ కు 62,144 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అంతే మొత్తం నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వదులుతున్నారు.