Maharashtra: బలపరీక్షలో శివసేన తన వైఖరి స్పష్టం చేయాలి : ఎన్సీపీ అధినేత శరద్‌పవార్
- మేం వ్యతిరేకంగా ఓటు వేస్తాం...శివసేన అదే చేయాలి
- అప్పుడే ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి ఆలోచిస్తాం
- బీజేపీ బేరసారాలకు పాల్పడకుండా గవర్నర్ చూడాలి
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని నిన్నటి వరకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మనసు మార్చుకున్నట్టున్నారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా శివసేన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి అప్పుడు ఆలోచిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నిన్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే శివసేన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం బీజేపీకి లేదు. ఈ పరిస్థితుల్లో శరద్‌పవార్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
గవర్నర్ నిర్ణయం అనంతరం మీడియాతో శరద్‌పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇప్పటికే గవర్నర్ ఆలస్యం చేశారని, బీజేపీకి మెజార్టీ ఉందా? లేదా? అన్నది గవర్నర్ తేల్చాలని కోరారు. బలపరీక్ష అంటూ జరిగితే తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. శివసేన కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు.
శివసేన వ్యతిరేక ఓటుతో బలపరీక్షలో బీజేపీ విఫలమైతే శివసేన-ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో శరద్‌పవార్ భేటీ కానుండడంతో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
కాగా, సభలో అవసరమైన బలం లేనందున బీజేపీ బేరసారాలకు తెరతీసే అవకాశం ఉందని, దీన్ని గవర్నర్ అడ్డుకోవాలని శరద్‌పవార్ కోరారు.