Pakistan: పాకిస్థాన్ ఎయిర్ పోర్స్ మ్యూజియంలో వింగ్ కమాండర్ అభినందన్ చిత్రం!
- మరోలా అక్కసును వెళ్లగక్కిన పాకిస్థాన్
- ఫిబ్రవరి 27న పాక్ దళాలకు పట్టుబడిన అభినందన్
- ట్విట్టర్ లో చిత్రాన్ని పంచుకున్న పాక్ జర్నలిస్ట్
నిత్యమూ భారత్ పై క్రూరమైన ఆరోపణలు, తప్పుడు ప్రాపగాండా చేస్తుండే పాకిస్థాన్, ఈదఫా మరోలా తన అక్కసును ప్రదర్శించింది. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నిలువెత్తు బొమ్మను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ జర్నలిస్ట్, పొలిటికల్ కాలమిస్టు అన్వర్ లోధీ, ఇందుకు సంబంధించిన చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. మిగ్-21 విమానాన్ని నడుపుకుంటూ, పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశించగా, దాన్ని కూల్చివేసిన పాక్ దళాలు, అభినందన్ ను బంధీగా పట్టుకున్నాయి. ఆ వెంటనే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో, మార్చి 1న వాఘా సరిహద్దు వద్ద అతన్ని విడిచిపెట్టారు.
"మ్యూజియంలో పీఏఎఫ్ అభినందన్ బొమ్మను ఉంచింది. అతని చేతిలో ఓ టీకప్పును కూడా ఉంచితే మరింత బాగుండేది" అని లోధీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.