Revanth Reddy: మల్కాజిగిరిలో నేను గెలుస్తానని.. నిజామాబాద్‌లో కవిత ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు: న్యూజెర్సీలో రేవంత్‌రెడ్డి
- న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్
- తెలంగాణలో పాలన ప్రజలు ఊహించినట్టుగా లేదని ఆవేదన
- బెంజి కారులో వచ్చి బతుకమ్మ ఆడేసి వెళ్లినందుకే ఉద్యమం చేశారట!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. న్యూజెర్సీలో సోమవారం ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన బాగుంటే నిజామాబాద్‌లో ఆయన కుమార్తె కవిత ఎందుకు ఓడిపోతారని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. మల్కాజిగిరిలో తానెందుకు గెలుస్తానని అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రకృతే ఆ పనులు చేసి పెడుతుందని అన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కానీ, మల్కాజిగిరిలో గెలుస్తానని కానీ తాను ఊహించలేదన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని కేసీఆర్ అంటున్నారని, మరి 50 శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కొడుకు, అల్లుడు వచ్చి పప్పన్నం తిని వెళ్లిపోయారని, బెంజ్ కారులో వచ్చిన కూతురు కవిత బతుకమ్మ ఆడి వెళ్లిపోయిందని అన్నారు. అంతమాత్రానికే తాము ఉద్యమంలో పాల్గొన్నామని చెబుతున్నారని, అలా అయితే, ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు తీసుకున్న వారి సంగతేంటని? వారినేమనాలని.. వారి రుణం ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రస్తుతం ప్రజలు ఊహించినట్టుగా పాలన లేదని, ఇది సివిల్ వార్‌కు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రేవంత్ అన్నారు. గతంలో నక్సలైట్లు అభివృద్ధికి అడ్డుగా ఉన్నారని అనేవారని, ఇప్పుడు వారుంటేనే బాగుంటుందనే పరిస్థితి వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు.