Shivsena: థాకరే కుటుంబ గౌరవాన్ని బీజేపీ దెబ్బతీసింది: శివసేన నేత అర్వింద్ సావంత్

  • 50:50 ఫార్ములాపై బీజేపీ మాట తప్పింది
  • థాకరేలు మాట మీద నిలబడే వ్యక్తులు
  • బీజేపీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవు

మహారాష్ట్రలో బీజేపీపై శివసేన నేతల విమర్శల తూటాలు పేలుతూనే ఉన్నాయి. థాకరే కుటుంబ గౌరవం దెబ్బతినేలా బీజేపీ వ్యవహరించిందని శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మండిపడ్డారు. 50:50 ఫార్ములాకు కట్టుబడి ఉంటామని బీజేపీ హామీ ఇచ్చిందని... ఆ తర్వాత అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని వ్యాఖ్యానించడం ద్వారా థాకరే కుటుంబ గౌరవానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించిందని దుయ్యబట్టారు.

మే 30న భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా తాను బాధ్యతలను స్వీకరించానని... లోక్ సభ ఎన్నికలకు ముందే తమ అధినేత ఉద్ధవ్ థాకరేతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశమై... 50:50 ఫార్ములాతో పాటు ముఖ్యమంత్రి పదవి పంపకంపై కూడా అంగీకారానికి వచ్చారని అర్వింద్ సావంత్ అన్నారు. థాకరేలు మాట మీద నిలబడే వ్యక్తులని... ఇప్పుడు వారికి మచ్చతెచ్చేలా బీజేపీ వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ కారణంగానే కేంద్ర మంత్రి పదవికి తాను రాజీనామా చేశానని చెప్పారు.

ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా అర్వింద్ మాట్లాడుతూ, తన రాజీనామాతో ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఒకరిపై మరొకరికి నమ్మకమే లేనప్పుడు కేంద్ర మంత్రిగా ఉండటంలో అర్థం లేదని చెప్పారు. బీజేపీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ లో పీడీపీతో కలిసినప్పుడు, ఉత్తరప్రదేశ్ లో మాయావతితో చేయి కలిపినప్పుడు, బీహార్ లో నితీశ్ కుమార్ తో కలిసినప్పుడు వారి సిద్ధాంతాలేమయ్యాయని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News