AVB: లంచం తీసుకుంటూ దొరికిపోయి వెక్కి..వెక్కి ఏడ్చిన భీమడోలు ఆర్ఐ సౌజన్య... వీడియో ఇదిగో!
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం అడిగిన సౌజన్యా రాణి
- ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ రెవెన్యూ అధికారిణి, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన చొప్పిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి ఇటీవల మరణించాడు. ఆయన కుమారుడు, కుమార్తె సైతం చనిపోయారు. వీరి తరఫున ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటూ మృతుని భార్య బేబీ, మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోగా, ఆ పత్రాలు ఆర్ఐ సౌజన్యా రాణి కార్యాలయానికి చేరాయి. ఆపై సర్టిఫికెట్ జారీకి ఆమె లంచం అడిగింది.
దీంతో రూ. 3 వేలకు డీల్ కుదుర్చుకున్న బేబీ, ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా, పట్టుకున్నారు. ఆపై సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇక తాను పట్టుబడిన తరువాత సౌజన్యా రాణి, వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాల వీడియోను మీరూ చూడవచ్చు.