NCP: కాంగ్రెస్ మద్దతు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలం: ఎన్సీపీ నేత అజిత్ పవార్
- మేము ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటాం
- నిన్నటి వరకు కాంగ్రెస్ స్పందన కోసం ఎదురుచూశాం
- కానీ, ఆ పార్టీ నేతలు స్పందించలేదు
- ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒంటరిగా నిర్ణయం తీసుకోలేము
కాంగ్రెస్ మద్దతు ఇస్తేనే మహారాష్ట్రలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని ఎన్సీపీ డిప్యూటీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మేము ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటాం. నిన్నటి వరకు కాంగ్రెస్ స్పందన కోసం ఎదురుచూశాం. కానీ, ఆ పార్టీ నేతలు స్పందించలేదు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒంటరిగా నిర్ణయం తీసుకోలేము. అయితే, ఇరు పార్టీల మధ్య ఎటువంటి అపార్థాలు లేవు. మేము కలిసే పోటీ చేశాం.. ముందుకెళ్తున్నాం' అని వ్యాఖ్యానించారు.
'గవర్నర్ విధించిన డెడ్ లైన్ లోపు ఎమ్మెల్యేల వివరాలు ఇవ్వడం సులువైన విషయం కాదు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి' అని అజిత్ పవార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం తమకు ఉందని, శివసేనతో కలిసి మాత్రం తామెప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.