Supreme Court: రేపు మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను స.హ. చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసులో తీర్పు
- సుప్రీంకోర్టు, సీజేఐ కార్యాలయం స.హ. చట్టం పరిధిలోకి వస్తాయంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు
- ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్
అయోధ్య స్థల వివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు... రేపు మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రెండూ ప్రభుత్వ సంస్థలేనని... అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని ఢిల్లీ హైకోర్టు 2010లో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4వ తేదీన పిటిషన్ ను రిజర్వ్ లో పెట్టింది. రేపు మధ్యాహ్నం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తుది తీర్పును వెలువరించనుంది.