Crime News: హత్య కేసులో నిందితులు... బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు

  • కేరళలో జంట హత్యల కేసులో వీరిపై అనుమానం
  • పరారవుతున్నారని సమాచారంతో నిఘా
  • కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా ఘటన

కేరళలోని వెన్ఫెని పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులను హత్యచేసి డబ్బు, నగలు దోచుకున్న ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన నిందితులు లబలు, జ్యూయెల్ లు తిరిగి తమ దేశానికి పారిపోయేందుకు ఆంధ్రా మీదుగా వెళ్తున్నారని కేరళ రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. 


పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. కేరళలో ఈనెల 11వ తేదీన వృద్ధ దంపతులను హత్యచేసి గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు నిందితులు బంగ్లాదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ హత్యకు పాల్పడింది బంగ్లాదేశ్ కు చెందిన లబలు, జ్యూయెల్ లు అని గుర్తించి వారికి సంబంధించి ఆధారాలు సేకరించారు.


ఈ నేపథ్యంలో నిందితులు ఇద్దరూ డబ్బు, బంగారంతో దేశం విడిచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెలియడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. తమకు అందిన ఆధారాలతో వారు ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్ వెళ్లి అక్కడి నుంచి తమ దేశానికి వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకున్నారని తెలుసుకుని విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన విశాఖ సిటీ పోలీసులతోపాటు ఆర్ పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది రైళ్లను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. కోరమాండల్ ఎక్స్ పెస్ లో ప్రయాణిస్తున్న వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.


నిందితులతోపాటు సొత్తును కేరళ పోలీసులకు అప్పగించారు. వారం రోజుల వ్యవధిలో బంగ్లాదేశీయులను విశాఖలో అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. గతవారం బంగ్లాదేశ్ కు చెందిన 16 మంది సభ్యుల ఓ ముఠా యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ లో వెళ్తుండగా అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు వీరిని పట్టుకున్నారు. తాజాగా ఇద్దరు హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News