Thunberg: ట్రంప్ తీరు ప్రమాదకరం: పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్ బర్గ్
- పర్యావరణం విషయంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రమాదం
- భూతాపం విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు
- ట్రంప్ ప్రదర్శించిన తీరే అందరినీ మేల్కొలిపింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్ బర్గ్ (16) విమర్శలు గుప్పించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... పర్యావరణం విషయంలో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే భూతాప నిరోధంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ విషయంలో ట్రంప్ ప్రదర్శించిన తీరే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని మేల్కొలిపిందని, ఉద్యమానికి దారి తీసిందని తెలిపింది.
వాతావరణ మార్పులపై ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కార్యాచరణ ప్రారంభమవడం శుభపరిణామమని గ్రెటా థెన్ బర్గ్ వ్యాఖ్యానించింది. ఈ కార్యాచరణ మొదలుపెట్టడానికి కొన్ని నెలల పాటు జాప్యం జరిగిందని చెప్పింది. కాగా, మూడు నెలలుగా ఆమె.. ఉత్తర అమెరికాలో తన తండ్రితో కలిసి పర్యావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంది. నిన్న యూరప్ కు బయలుదేరింది.
ఆమె పాఠశాలకు సెలవు పెట్టి మరీ పర్యావరణ మార్పులపై ఉద్యమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆమె ఇటీవల ఐరాసలో చేసిన ప్రసంగం.. పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని ఆలోచింపజేసింది.