Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు క్షమాపణలు చెప్పిన టీవీ న్యూస్ చానెల్!
- నిరాధార ఆరోపణలు చేశారని ఇమ్రాన్ భార్య రెహం పరువు నష్టం దావా
- కోర్టులో కేసు గెలిచిన రెహం
- పాక్ లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని వ్యాఖ్య
తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ దునియా టీవీపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ పరువునష్టం దావా కేసు వేసి, గెలిచారు. ఆ వార్తా సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా నష్ట పరిహారం ఇచ్చి, కోర్టు ఖర్చుల్నీ భరిస్తామని తెలిపింది.
పాక్ సంతతి బ్రిటిష్ పౌరురాలైన రెహం ఖాన్ పాక్‌లో ఎన్నికల ముందు తన మాజీ భర్త ఇమ్రాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ కు చెందిన పీటీఐ పార్టీలోని కొందరు నాయకులు ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు.
తమ ప్రత్యర్థి పార్టీ పాక్ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ వద్ద నుంచి రెహం డబ్బు తీసుకుని ఆత్మకథను రాసేందుకు సిద్ధమయ్యారని, ఎన్నికల ముందు ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఆమెను వాడుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
ఇప్పటి పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అప్పట్లో దునియా ఉర్దూ టీవీ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ చానెల్ ఇంగ్లాండ్‌లో కూడా ప్రసారమవుతుంది. రషీద్ చేసిన ఆరోపణలను ఆ చానెల్ తరుచూ ప్రసారం చేయడంతో రెహం.. లండన్‌లోని రాయల్ కోర్టులో పరువునష్టం దావా వేసి గెలిచారు. ఈ తీర్పుతో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. పాక్ లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని అన్నారు.