NCP: వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యేలు చెప్పారు: అజిత్ పవార్
- కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపే ప్రభుత్వం ఏర్పడుతుంది
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నాం
- శివసేన, కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్నాం
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో ఎన్సీపీ తమ చర్చలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ డిప్యూటీ చీఫ్ అజిత్ పవార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ రోజు మా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యాము. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు అన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతోనూ చర్చలు జరుపుతున్నామని అజిత్ పవార్ తెలిపారు. తమ మిత్రపక్షాలతో పూర్తిగా చర్చించే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎన్నికల ముందే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నామని, తమ మేనిఫెస్టో ఒకేటనని ఆయన అన్నారు. అయితే, శివసేన మేనిఫెస్టో మాత్రం వేరని అన్నారు. శివసేనతో కలిసి పనిచేసే అంశంపై కాంగ్రెస్ తో చర్చిస్తామని చెప్పారు. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు తగినంత సంఖ్యా బలం ఉంటే వారు గవర్నర్ దగ్గరికి వెళ్లి, తమను ఆహ్వానించవలసిందిగా కోరవచ్చు.