Jagan: బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు దిగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
- కక్ష సాధింపు ధోరణితో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది
- గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది
- వెంకయ్యనాయుడిపై జగన్ వ్యాఖ్యలు సరికాదు
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మంచి పాలన అందించాలని, కక్ష సాధింపులు మంచి సంప్రదాయం కాదనే విషయం గ్రహించాలని సూచించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా సరే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని... పొత్తు లేకపోతే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని తెలిపారు.
మరోవైపు, విశాఖలో వివిధ శాఖల అధికారులతో ఈరోజు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ, తీరప్రాంత భద్రతపై చర్చ జరిగింది. సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జీవీఎంసీ అధికారుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.