Kul Bhushan: కుల్ భూషణ్ జాదవ్ కేసులో ఊరటనిచ్చే మలుపు!
- ఐసీజే తీర్పుతో పాకిస్థాన్ సైనిక చట్టం సవరణకు ఓకే చెప్పిన ఇమ్రాన్ సర్కార్
- సవరణ తర్వాత కుల్ భూషణ్ సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం
- న్యాయ వాదిని నియమించుకునే వెసులుబాటు
తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ నేరారోపణ చేసి, పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన భారత నౌకాదళ విశ్రాంతి అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు ఊరట లభించింది. పాక్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయాలన్న తీర్పుకు ఆ దేశంలోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తలవొగ్గింది. ఐసీజే తీర్పును అమలు చేయడానికి పాక్ సైనిక చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనితో కుల్ భూషణ్ తనకు విధించిన శిక్షపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశమేర్పడుతుంది.
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ రాష్ట్రంలో పాక్ బలగాలు కుల్ భూషణ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్ లో అక్కడి కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై భారత్ అదే ఏడాది మేలో ఐసీజేను ఆశ్రయించింది. ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటుండగా ఆయనను పట్టుకుని అక్రమంగా నిర్భంధించారని, న్యాయ సలహాలను పొందాడానికి కూడా అవకాశమివ్వటంలేదని భారత్ ఆరోపించింది.
భారత్ పిటిషన్ పై గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టిన ఐసీజే, కుల్ భూషణ్ ఉరిశిక్షను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. భారత్ కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని తెలిపింది. కుల్ భూషణ్ పై విధించిన శిక్షను పాక్ సమీక్షించేంతవరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.