Jagan: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి... అందరి పొట్టకొట్టారు: బోండా ఉమ
- జగన్ సీఎం అయిన వెంటనే కార్మికులపై తొలి దెబ్బ కొట్టారు
- ఎప్పుడూ లేని ఇసుక కొరత ఇప్పుడే ఎందుకొచ్చింది?
- రూ. 4 వేల ఇసుకను రూ. 40 వేలకు అమ్ముతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం తమ అధినేత చంద్రబాబు పాటుపడ్డారని... జగన్ పాలన రివర్స్ రూటులో ఉందని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ... ఇసుకపై ఆదాయాన్ని ఆశించకుండా, ఉచితంగా ఇచ్చామని తెలిపారు. ఏ ప్రాంతంలోని ఇసుకను ఆ ప్రాంత ప్రజలే వాడుకునేలా ఒక గొప్ప ఉచిత ఇసుక పాలసీని అమలు చేశామని చెప్పారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్ష వేదికపై నుంచి మాట్లాడుతూ బోండా ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్... తొలి దెబ్బ కార్మికులపై కొట్టారని ఉమ అన్నారు. పస్తుల బాధ పడలేక, కుటుంబాలను పోషించుకోలేక 36 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారంతా కాలంచెల్లి చనిపోయారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంత వరకు కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. పూర్వీకుల కాలం నుంచి ఎప్పుడూ ఇసుక కొరత రాలేదని... జగన్ సీఎం అయిన తర్వాతే ఎందుకు కొరత వచ్చిందని ప్రశ్నించారు. రూ. 4 వేల ఇసుకను రూ. 40 వేలకు అమ్ముతున్నారని... ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని నిలదీశారు. తమతో కలిసొచ్చే అన్ని పార్టీలు, యూనియన్లతో కలిసి ప్రబుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు.