Routes privatisation: రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ ఈనెల 18కి వాయిదా
- కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు వేసిన పిల్ పై విచారణ
- కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేలేదెందుకన్న కోర్టు
- ఆర్టీసీ నోటీస్ లో పెట్టకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆక్షేపణ
తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య వాద ప్రతి వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ప్రొసీడింగ్స్ ను మాత్రమే సమర్పించడంపై కోర్టు ఆక్షేపించింది. కేబినెట్ నిర్ణయాలను ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తేలేదని ప్రశ్నించగా, కేబినెట్ నిర్ణయమే కాబట్టి తేలేదంటూ.. జీవో వచ్చాక అందరికి అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ నోటీస్ లో పెట్టకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ హైకోర్టు నిలదీసింది.