Pawan Kalyan: ఆంధ్రాలో మాత్రమేనా, తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రశ్నించడా?: వల్లభనేని వంశీ
- తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే పవన్ ప్రశ్నించరు
- ఆ రాష్ట్రంలో ఒక నీతి, ఈ రాష్ట్రంలో మరో నీతా?
- దీన్ని సంసారమంటారా?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంటే పవన్ కల్యాణ్ ప్రశ్నించరని, కేవలం, ఆంధ్రాలో మాత్రమే ఆయన ప్రశ్నిస్తాడని సెటైర్లు విసిరారు. అంటే, ఆ రాష్ట్రంలో ఒక నీతి, ఈ రాష్ట్రంలో మరో నీతి అని విమర్శించారు. దీన్ని ఏమంటారు? సంసారమంటారా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష హోదా కూడా టీడీపీ పోగొట్టుకోవాల్సి వస్తుంది
2019 ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చారని, అధికార పార్టీని దించేసే శక్తి ఎవరికీ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచిని మంచిగా, చెడును చెడుగా చూడాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచి పనిని అంగీకరిస్తే ప్రజా తీర్పును గౌరవించినట్టు అవుతుందని అన్నారు.
‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరెళ్లి చేలో పడితే, దూడల్లా మేము మీ వెనుక వస్తే మా భవిష్యత్తులు ఏమవుతాయి?’ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇదే తీరున వ్యవహరిస్తే, తెలంగాణలో టీడీపీ ఏరకంగా అయితే అయిపోయిందో, ఇక్కడ కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెలుగుదేశం పార్టీ పోగొట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీడీపీకి కనీసం రెండు వేల ఓట్లు కూడా రాలేదని అన్నారు.