Telangana: సమ్మెతో మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్.. చికిత్స పొందుతూ మృతి!

  • ఆర్టీసీ సమ్మెతో మతిస్థిమితం కోల్పోయిన కండక్టర్ 
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • జోగిపేటలో కార్మికుల ఆందోళన

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో కండక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ సమ్మెతో మతిస్థిమితం కోల్పోయిన మెదక్ జిల్లా చిన్నఘనపూర్‌కు చెందిన కండక్టర్ పులబోయిన నాగేశ్వర్ (45) ఇటీవల వింతగా ప్రవర్తించాడు. డ్యూటీ అంటూ నవ్వేవాడు. అంతలోనే డిస్మిస్ అంటూ ఏడ్చేవాడు. స్టేజి వచ్చింది దిగాలంటూ కలవరించేవాడు. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.

నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌‌గా పనిచేస్తున్న నాగేశ్వర్ మృతి విషయం తెలిసి కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో జోగిపేటకు తరలించారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్‌, సంగారెడ్డి, మెదక్‌ తదితర డిపోలకు చెందిన సుమారు వంద మంది కార్మికులు జోగిపేటకు చేరుకున్నారు. నాగేశ్వర్‌ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, రూ.5 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూం ఇంటిని మంజూరు చేస్తామని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

  • Loading...

More Telugu News