Maharashtra: రాజకీయం, క్రికెట్ ఒకటే.. అనూహ్య పరిణామాలుంటాయి: కేంద్ర మంత్రి గడ్కరి
- ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం
- మహారాష్ట్రలో పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రస్తుతం నేనైతే ఢిల్లీ వ్యవహారాలతో బిజీగా ఉన్నా
మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం, గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనల మధ్య మాటల వర్షం కురుస్తున్న నేపధ్యంలో కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాలు, క్రికెట్ ఒకటే బాపతు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక్కోసారి మన ఊహకు అందకపోవచ్చు' అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
'క్రికెట్ మ్యాచ్ లో ఒక్కోసారి ఓటమి అంచుల వరకు వెళ్లిన జట్టు అనూహ్యంగా గెలుపు చేజిక్కించుకుంటుంది. అప్పటి వరకు ఇక గెలిచేసినట్టే అనుకున్న జట్టు అనూహ్య ఓటమితో తేరుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. రాజకీయం కూడా అంతే' అంటూ నర్మగర్భంగా అన్నారు. ప్రస్తుతం తానైతే ఢిల్లీ వ్యవహారాలతో బిజీగా ఉన్నానని తెలిపారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం ఉండదని, అవి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారం చేపట్టినా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. అయితే గడ్కరి వ్యాఖ్యల వెనుక ఏదో మర్మం ఉందని, కేంద్ర నాయకత్వం తర్వాత అడుగుల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఏర్పడింది. దాని మిత్రపక్షం శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. గవర్నర్ అన్ని పార్టీలకు పభుత్వం ఏర్పాటుకు గడువిచ్చినా సాధ్యం కాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు.
ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.