Botsa Satyanarayana: అమరావతిపై హైకోర్టులో విచారణ.. మంత్రులు బొత్స, బుగ్గనతో పాటు పలువురికి నోటీసులు!
- హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్
- రాజధాని విషయంలో చెలరేగుతోన్న వివాదంపై విచారణ
- బొత్స పలుసార్లు వివాదాస్పద ప్రకటనలు చేశారన్న న్యాయవాది
- విచారణ 28వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చెలరేగుతోన్న వివాదంపై వివరణ ఇవ్వాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, రాజధాని కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, కమిటీ సభ్యులు తదితర ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాజధాని విషయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అలజడి రేపిన విషయం తెలిసిందే. తాము వేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని, రాజధానిపై ప్రజాభిప్రాయం సేకరించి నివేదిక ఇస్తుందని చెప్పారు. అనంతరం కేబినెట్ లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే, నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై నిన్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రాజధాని ప్రణాళికల పునఃసమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీపై వైఖరి తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనిపై వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. అనంతరం విచారణను 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కాగా, రాజధాని ప్రాంతంలో రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తదితర నిర్మాణాలు జరగాల్సి ఉండగా, కేంద్రం ఇప్పటికే రూ.1500 కోట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతోన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం నిర్మాణ పనుల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.
నిన్న జరిగిన వాదనల్లో పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ హైకోర్టుకు తమ వాదనలు వినిపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ పలుసార్లు పొంతనలేని వివాదాస్పద ప్రకటనలు చేశారని మీడియాలో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చెప్పారు. అలాగే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా హైకోర్టు తరలింపుపై పలు వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హైకోర్టు కోసం విధులు బహిష్కరించారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నోటీసులను జారీ చేసింది.