Kabaddi: ఆఖరి నిమిషం వరకు పోరాడడం అంటే ఏంటో ఈ వీడియో చెబుతుంది: ఆనంద్ మహీంద్రా
- కబడ్డీ మ్యాచ్ లో అరుదైన దృశ్యం
- పాయింట్ గెలుచుకున్న ఆటగాడ్ని లైన్ వద్దే ఒడిసిపట్టిన ప్రత్యర్థి ఆటగాడు
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తలమునకలయ్యే వ్యాపార లావాదేవీలు ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాపైనా ఓ కన్నేస్తుంటారు. తాజాగా ఆయన రీట్వీట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన వీడియోలో ఓ కబడ్డీ మ్యాచ్ కు చెందిన రోమాంఛక సన్నివేశం ఉంది.
కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్ ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు. ఈ వీడియో చూసి విస్మయానికి గురైన ఆనంద్ మహీంద్రా, ప్రొకబడ్డీ లీగ్ లో కూడా ఇలాంటి సీన్ చూడలేదని కామెంట్ చేశారు.