West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో భూతగాదా.. వైసీపీ నేత దారుణ హత్య
- రాడ్లు, గొడ్డళ్లతో పొలంలో దాడి
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
- ఐదుగురి అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేత ఒకరు పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని భీమడోలు మండలం కొత్త అంబర్‌పేటకు చెందిన పసుమర్తి వెంకట కిశోర్ (36) శుక్రవారం తాను కౌలుకు తీసుకున్న పొలంలో కోత కోయిస్తుండగా ఐదుగురు వ్యక్తులు వచ్చి రాడ్లు, గొడ్డళ్లతో దాడిచేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
కిశోర్ కౌలు చేస్తున్న 11.50 భూమి తగాదాల్లో ఉంది. దాసరి బుల్లెమ్మ అనే మహిళ ఈ భూమికి యజమాని. భర్త, కుమారుడు మృతి చెందడంతో 1996లో తణుకు పట్టణానికి చెందిన రాజశేఖర్‌కు ఈ భూమిని విక్రయించింది. అయితే, ఈ భూమికి తామే వారసులమంటూ టీడీపీ మాజీ ఎంపీటీసీ జువ్వా స్వామి, ఏసుపాదం, సులేమాన్రాజులు వేధిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు, ఈ భూమిని కౌలుకు తీసుకున్న కిశోర్‌ను పొలం నుంచి ఖాళీ చేయించేందుకు వారు గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 8న పొలంలో కిశోర్ ఆరబోసిన ధాన్యాన్ని జువ్వా స్వామి, అతని సోదరులు ఎత్తుకుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కక్షపెంచుకున్న వారు కిశోర్‌ను పొలంలోనే హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు జువ్వా ఏసుపాదం, జువ్వా స్వామి, జువ్వా సులేమాన్‌రాజుతో పాటు శశికుమార్, బుచ్చిబాబులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.