Tresure hunt: గుప్త నిధుల కోసం గుడిలో తవ్వకాలు.. ఆలస్యంగా వెలుగులోకి పూజారి నిర్వాకం!
- తవ్వకాల సందర్భంగా వీడియోతీసిన అనుచరుడు
- విభేదాలు రావడంతో గ్రామస్థులకు పంపిన వీడియో
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
భక్తి శ్రద్ధలతో దేవుని సేవకు పరిమితమై ఆ దేవదేవుని ఆశీర్వాదానికి పాత్రుడు కావాల్సిన ఓ పూజారి అత్యాశకు పోయి గుప్త నిధుల కోసం గుడిలోనే తవ్వకాలు జరిపాడు. నిధులేమీ లభించలేదు సరికదా ఎనిమిది నెలల క్రితం నాటి తన నిర్వాకం తాజాగా బయటపడడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.
హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... జిన్నాయిగూడెంలో అత్యంత ప్రాచీనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సత్యం శివం సుందరం దాసు అనే వ్యక్తి ఏడేళ్లుగా పూజారిగా పనిచేస్తున్నాడు.
ప్రాచీన ఆలయం కావడంతో గుప్త నిధులు, బంగారు విగ్రహం ఉంటుందన్న ఆశ దాసుకు కలిగింది. స్థానికుల్లో కొందరిని సంప్రదించి ఈ విషయం తెలిపి వారిలో ఆశలు రేకెత్తించాడు. దీంతో అందరూ కలిసి పథకం వేశారు. ఎనిమిది నెలల క్రితం గర్భగుడి ఎదుట తవ్వకాలు చేపట్టారు. దాదాపు 12 అడుగుల లోతున తవ్వకాలు జరిపినా ఏమీ దొరకక పోవడంతో నిరాశతో తవ్విన మట్టిని గోతిలో వేసి యథాతథంగా కప్పేసి చదును చేశారు.
కాగా, దాసు వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖాన్ పూర్ కు చెందిన సోను అనే వ్యక్తి పనిచేసేవాడు. పూజారితో విభేదాలు రావడంతో ఈనెల 11న అతను సొంతూరు వెళ్లిపోయాడు. అయితే గుడిలో తవ్వకాలు జరిపినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా సోను వీడియో తీశాడు.
పూజారితో విభేదాలు రావడతో ఆ వీడియోను గురువారం జిన్నాయిగూడెం, రావిర్యాల గ్రామాలకు చెందిన వారిలో కొందరి ఫోన్ నంబర్లకు పోస్టు చేశాడు. సోను పంపిన వీడియో క్లిప్పింగులు చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పూజారి దాసును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.