Vijay Sai Reddy: రాంగ్ మార్చ్, ఒక్కపూట నిరాహార దీక్ష కోసం చేసిన ఖర్చుతో 1000 కుటుంబాలు ఏడాది జీవిస్తాయంటున్నారు: విజయసాయి
- లాంగ్ మార్చ్, ఒక్కపూట దీక్ష కార్యక్రమాలపై విజయసాయి సెటైర్లు
- వల్లభనేని వంశీ ప్రస్తావనతో చంద్రబాబు, పవన్ లపై విమర్శలు
- వంశీ అంతఃపుర రహస్యాలు వెల్లడించాడంటూ ట్వీట్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు కానీ, బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాంగ్ మార్చ్, ఒక్క పూట దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాదిపాటు జీవిస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా, తన వ్యాఖ్యల్లో వల్లభనేని వంశీని కూడా ప్రస్తావించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందన్న విషయాన్ని వంశీ వెల్లడించాడని విజయసాయి పేర్కొన్నారు. గన్నవరంలో పవన్ సీపీఐ అభ్యర్థిని పోటీకి దింపింది చంద్రబాబు ఆదేశాల మేరకే అని కూడా వంశీ అంతఃపుర రహస్యాలు బయటపెట్టాడని వివరించారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల బి-ఫారాలు సైతం టీడీపీ ద్వారానే వెళ్లినట్టు తెలిసిందని విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు.