Chinthamaneni Prabhakar: వనజాక్షి వ్యవహారం గురించి మాట్లాడిన చింతమనేని ప్రభాకర్
- ఇప్పటికీ వనజాక్షి వ్యవహారం ప్రస్తావిస్తున్నారని ఆవేదన
- ఆమెపై తాను దౌర్జన్యం చేయలేదని వెల్లడి
- చేతనైతే మొదట్నించి విచారణ జరిపించాలని సవాల్
టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై బయటికి వచ్చిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో అప్పటి ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంపై ఇప్పటికీ తన గురించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు గారు నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ తనపై సెక్షన్ 350 కింద కేసు నమోదు చేయించారని తెలిపారు.
ఇవాళ మీ కార్యదర్శిగా ఉన్న సాల్మన్ అరోకియ రాజ్ గారు నేను తప్పుచేశానని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. అరోకియ రాజ్ గారు నాడు సెర్ప్ సీఈవోగా ఉంటే ఆయన్ను జేసీ శర్మ కమిటీలో సభ్యుడిగా నియమించారని, వనజాక్షి వ్యవహారాన్ని జేసీ శర్మ కమిటీనే విచారణ జరిపిందని చింతమనేని వెల్లడించారు.
వనజాక్షిపై తాను ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, దాడి చేయలేదని, ఆమెను దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పానని తెలిపారు. ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చినట్టు వనజాక్షిని తాను ఈడ్చినట్టు దుర్మార్గంగా ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. "అప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు సీఎంవి కదా, వనజాక్షి వ్యవహారాన్ని మొదటి నుంచి విచారణ జరిపించు. నేను డిమాండ్ చేస్తున్నా" అంటూ చింతమనేని సీఎం జగన్ కు సవాల్ విసిరారు.