TJRTC: కేసీఆర్ నిరంకుశత్వంగా వ్వవహరిస్తున్నారు : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
- గృహ నిర్బంధంలోనే కొనసాగుతున్న నిరాహార దీక్ష
- ఆర్టీసీ ఎండీ తీరు రాజకీయ నాయకుడిలా ఉంది
- ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదు
కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కార్మికుల న్యాయమైన సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తోందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహారం అలా ఉంటే ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కూడా రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నిన్నటి నుంచి అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ పార్క్ లో దీక్ష చేయాలని అనుకున్నా పోలీసులు అనుమతించకుండా గృహనిర్బంధం చేయడంతో ఆయన ఇంట్లోనే దీక్ష ప్రారంభించారు.
రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న ఆయనతో దీక్ష విరమింపజేసేందుకు పోలీసులు చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించేదాకా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరుకుంది.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటూ ఉండడంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తోపాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.