Hyderabad: దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అనే ప్రతిపాదన మా వద్ద లేదు: కిషన్ రెడ్డి
- శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధం
- ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది
- టీఆర్ఎస్ ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడాలి
- కార్మికులతో చర్చలు జరపాలి
రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అనే ప్రతిపాదన తమ వద్దలేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని తాము చెప్పలేదని అన్నారు. విభజన ప్రకారమే తాము పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని వ్యాఖ్యానించారు.