Kodali Nani: కొడాలి నాని, వల్లభనేని వంశీలపై విరుచుకుపడ్డ కళా వెంకట్రావు
- తాజా పరిణామాలపై కళా వ్యాఖ్యలు
- జగన్ మెప్పుకోసమే కొడాలి వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ
- ఎవరైనా టీటీడీ నిబంధనలు పాటించాల్సిందేనని ఉద్ఘాటన
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ మెప్పు కోసం మంత్రి కొడాలి నాని టీటీడీ సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ వ్యవహారాలపై కొడాలి నాని వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రవేశించే ఇతర మతస్తులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలన్నది ముఖ్యమైన నిబంధన అని, ఏ ఇతర మతస్తుడైనా ఆ నిబంధన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇక, వల్లభనేని వంశీ గురించి స్పందిస్తూ, సమస్యలపై పోరాడడం చేతకాక చేతులెత్తేశాడంటూ విమర్శించారు. పవిత్రమైన అయ్యప్ప దీక్షలో ఉండి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడడం ఏంటని ప్రశ్నించారు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం గన్నవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు.