Vijayawada: తలకెక్కిన మద్యం మత్తు.. అన్న కుమార్తెను మూడో అంతస్తు నుంచి కిందికి విసిరేసిన బాబాయి!
- విజయవాడ శివారులోని వాంబే కాలనీలో ఘటన
- జుట్టు పట్టుకుని ఆరేళ్ల చిన్నారిని కిందికి విసిరేసిన బాబాయి
- పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
మద్యం మత్తు తలకెక్కడంతో ఓ వ్యక్తి సొంత అన్న కుమార్తెను మూడో అంతస్తు నుంచి కిందికి విసిరేశాడు. విజయవాడ శివారులోని వాంబేకాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు కాలనీలోని సీ2, 35వ బ్లాక్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్నారు. తన సోదరుడు కృష్ణతో కలిసి ఏసుబాబు టైల్స్ పనులు చేస్తుంటాడు.
మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో కృష్ణ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు సోదరుడి ఇంటి వద్దే ఎక్కువగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు ఏసుబాబు భార్య శ్రీదేవి భోజనం వడ్డించింది. అయితే, మద్యం మత్తులో ఉన్న కృష్ణ భోజనం చేస్తూ ఇల్లంతా అన్నం పడేశాడు. దీంతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని శ్రీదేవి ప్రశ్నించింది. కోపంతో ఊగిపోయిన కృష్ణ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. సోదరుడు ఏసుబాబు కల్పించుకోవడంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది.
దీంతో మరింత రెచ్చిపోయిన కృష్ణ సోదరుడి ఆరేళ్ల కుమార్తె జానకి జుట్టు పట్టుకుని పైకి లేపి మూడో అంతస్తు నుంచి కిందికి పడేశాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన స్థానికులు కృష్ణను పట్టుకుని దేహశుద్ధి చేశారు. శ్రీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.